గ్లామర్ చావు

రామలింగం రచ్చబండ  దగ్గరకు వచ్చాడు.రచ్చబండ మీద నారయ్య కూర్చుని ఉన్నాడు.'ఏం నారయ్యా' అంటూ పలకరించాడు రామలింగం.నారయ్య సమాధానం చెప్పలేదు.ఏదో తీవ్రాలోచనలో మునిగిఉన్నాడు.
రామలింగం నారయ్య పక్కన కూర్చున్నాడు.
'నారయ్యా! ఏమిటి ఆలోచిస్తున్నావు?' అని అడిగాడు. 
'చావు గురించి!' చెప్పాడు నారయ్య.
'అయితే  మనూర్లో మరో రైతు ఆత్మహత్య జరగబోతోందన్నమాట '' అన్నాడు రామలింగం.
' నేను చెప్పేది నా చావు గురించి కాదు ' అన్నాడు నారయ్య కోపంగా.
' నాకర్థమైంది. అప్పు కోసం చచ్చేలా తిరుగుతున్నావు బ్యాంకు చుట్టూ .ఆ ఆఫీసర్  నిన్ను కుక్కలా తిప్పుకుంటున్నాడు కానీ లోన్ ఇవ్వడం లేదు.అందుకని అతన్ని చంపేద్దామనుకుంటున్నావు . అంతే కదా.' అన్నాడు రామలింగం.
' నీ ఊహాశక్తికి ఓ నమస్కారం . నేను ఆలోచించేది వేరే విషయం.  చావు అందరికీ ఒకటేనా?  లేక వేరు వేరా? అని.'
' చావు ఎవరికైనా ఒకటే ! యముడేమైనా గుళ్ళో పూజారా! డబ్బుండే వాడ్ని ఒకలా, లేనివాడిని ఒకలా చూడడానికి . ఒక్కోరు ఒక్కోలా చావచ్చు గానీ చివరకు చావు అనేది ఒకటే. '
' నీ పాయింట్ కే వద్దాం . నిన్న మన వీధిలో  సూరయ్య చనిపోయాడు. అదే టైం లో ఓ సినీ నటుడి కొడుకు చనిపోయాడు. ఇద్దరి చావులూ ఒకటే అయినపుడు సూరయ్య చావును ఎవరూ ఎందుకు పట్టించుకోలేదు? సినీ నటుడి చావును మీడియా అదే పనిగా ఎందుకు ఊదరగొట్టింది ? ' అని అడిగాడు నారయ్య.
' సూరయ్య శవం దగ్గరకు సినిమా నటులు రాలేదు కదా ! సినిమా నటులు ఎక్కడ ఉంటే మీడియా అక్కడ ఉంటుంది . సినిమా నటులు ఉంటేనే జనం కూడా చూస్తారు. మీడియా పట్టించుకోవాలంటే చావుకు కూడా గ్లామర్ కావాలి . ' చెప్పాడు రామలింగం.
' అయితే చావుల్లో తేడాలున్నట్లే కదా ! '
' చావులో తేడా ఉండదు. జనం దాన్ని చూడడంలో తేడా ఉంటుంది. సామాన్యుల చావుని ప్రభుత్వం గానీ , మీడియా గానీ , ప్రజలు గానీ , అఖరికి సామాన్యులు గానీ పట్టించుకోరు. సామాన్యుడు ఎలా చచ్చినా ఎవరికీ పని లేదు. అదే ఒక ప్రముఖుడు చనిపోయినా , ఆఖరికి ప్రముఖుడి ఇంట్లో పిల్లి చనిపోయినా దానికే విలువ. ' చెప్పాడు రామలింగం.
' ఎంత తేడా!'
' ఇందులో తేడా ఏమీ లేదు. లోకం తీరే అంత. ఈ సమాజంలో బ్రతకాలన్నా , చావాలన్నా ప్రముఖుడిగా మారాల్సిందే. ధనవంతుడో , సినిమానటుడో , వ్యాపారస్తుడో , రాజకీ నాయకుడో .. ఏదో ఒకటి కావాలి. సామాన్యుడిగా బ్రతకడమూ కష్టమే.  చావడమూ కష్టమే! ' అంటూ లేచాడు రామలింగం.
రచ్చబండ వెనుక సూర్యుడు ఎర్రని జేగురురంగులో అస్తమిస్తున్నాడు .. ఈ లోకం తీరును చూస్తూ.

No comments:

Post a Comment