యానిమేషన్ సైంటిస్ట్ సీతారాం తో .. ఇంటర్వ్యూ

ఎక్కడో ఆంధ్రదేశంలోని మారుమూల ..శ్రీకాకులం జిల్లాలోని పలాస మండలంలో .. వీఐపి గా అందరి గౌరవాలను అందుకుంటూ ..కారు మీద తిరుగుతూ హాయిగా బ్రతుకుతున్న ఓ వ్యక్తి .. నేడు హైదరాబాద్ నగరంలో కాలినడకన తిరుగుతూ బ్రతుకుపోరు సాగిస్తున్నాడు . ఇష్టపడ్డదారిలో కష్టపడుతూ నడవాలా ..లేక పాత బిజినెస్ ప్రారంభించి అందరిలా నడవాలా అని మధనపడుతున్నాడు . అతని పేరు కొత్తపల్లి సీతారాం. వయసు యాభై.

అసలీ తెలుగు దేశం లో  కళాహృదయంతో పుట్టడం పెద్ద దౌర్భాగ్యం . నిజమైన కళాకారులకీ గడ్డ మీద ప్రొత్సాహం లభించదు . కళాకారులమని ఫోజులు కొట్టేవారికే ఇక్కడ విలువ. ఈ సీతారాం ఇతరరాష్టం లోనో , ఇంకా చెప్పాలంటే ఇతర దేశంలోనో పుట్టుంటే ఇతని ఆవిష్కరణకు గొప్ప గుర్తింపు దొరికేది.

సీతారాం చేతిలో వినూత్నమైన కళ ఉంది . ఆ కళతో ఒక రూపాయికి వంద రూపాయలు సంపాదించి పెట్టగల మేధస్సు ఉంది. కానీ ప్రోత్సాహం లేదు. అందరూ పొగిడేవారే... కానీ పెట్టుబడిపెట్టే నిర్మాతలే లేరు. ఎవరైనా సహృదయులు స్పందించి ప్రోత్సహించదలచుకుంటే ఇది సీతారాం కాంటాక్ట్ నంబరు ..98499 32519 .

ఒక సాయంత్రం వేళ  సీతారాంతో జరిపిన మాటామంతీ ఇది.  ...

సీతారాం గారూ ..మీరు తీసిన "అంధవిశ్వాస్ " మొన్న జరిగిన ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది కదా!  దాని గురించి చెప్పండి .

మొన్న 2009 లో హైదరాబాద్ లో 16 వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరిగింది .దానిలో నా " అంధవిశ్వాస్ " ప్రదర్శించబడింది .

 దానికి సంబంధించి నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక సంఘటన చెప్తాను.

ఫెస్టివల్ జరుగుతోంది . నేను ఐమాక్స్ లో ఉన్నాను .ఆ మరుసటిరోజు నా చిత్ర ప్రదర్శన. ప్రసిద్ద చిత్రకారులు చంద్ర కనిపించారు .ఆయన నాకు తెలియదు .ఒక మిత్రుడు 'ఆయనే చంద్ర ' అంటూ చూపించాడు . నేను బెరుగ్గానే ఆయన దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకున్నాను .

' నువ్వు యానిమేటర్ వా . తెలుగువాడివా . ఒక కొత్త యానిమేషన్ టెక్నిక్ కనిపెట్టావా. వెరీ గుడ్ . ' అంటూ ఒకింత ఆశ్చర్యం తోనూ మరికొంత ప్రోత్సాహంతోనూ మాట్లాడారు . అంతేకాదు . నన్ను పక్కన పెట్టుకుని  గేటు దగ్గర నిలబడి వచ్చే పోయే మీడియావారికీ , మిత్రులకు ..అందరికీ నా గురించి చెప్పి , నా చిత్ర ప్రదర్శనకు రమ్మని ఆహ్వానించాడా మంచిమనిషి .

చెప్పింది చంద్ర కాబట్టి దాదాపు అందరూ వచ్చారు .

స్క్రీన్ నెం 2 లో ప్రదర్శన.

నాకు చెమట్లు పట్టాయి .వచ్చిన వారిని నా చిత్రం మెప్పించలేకపోతే ఎంత చిన్నతనం.

నా అంధవిశ్వాస్ భారీ బడ్జెట్ తో తీసింది కాదు .అన్ని సదుపాయాలతో తీసింది కాదు .

ఎందుకైనా మంచిదని నా మిత్రుడైన ఓ కెమరామన్ ని ప్రేక్షకుల మధ్యన  కూర్చోబెట్టాను.  .. చిత్రం చివర్లో చప్పట్లు కొట్టమని . ఎందుకంటే ఈ ఫెస్టివల్స్ లో ఎవరూ ముందు చప్పట్లు కొట్టరు . ఎవరో ఒకరు ప్రారంభించాలి .అప్పుడు అందరూ చప్పట్లు కొడతారు .లేకపోతే ఎవరూ కొట్టరు .

ప్రదర్శన ప్రారంభమైంది  . 

పిల్లి పాత్ర ప్రవేశించింది .
చప్పట్లు ...  నా మిత్రుడినుంచి కాదు . ప్రేక్షకులనుంచి .థియేటర్ దద్దరిల్లేలా చప్పట్లు .మొత్తం పద్నాలుగుసార్లు .  చంద్ర గారే ఆశ్చర్యపోయారు . అభినందించారు .  ఒక కళాకారుడికి  అంతకంటే ఎం కావాలి .

నా 'అంధవిశ్వాస్ ' కి మూలం పంచతంత్రం .

పంచతంత్రం లోని .. కళ్ళు కనిపించని ముసలి గద్ద ,  పిల్లి అమాయకమైన మాటలు నమ్మి ఎలా మోసపోయిందో తెలిపే కథనే నేను యానిమేషన్  లో అంధవిశ్వాస్ గా మలిచాను .

ఈ 22 ని.ల చిత్రం మొత్తం ఆరు ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడి అందరి అభినందనలు అందుకుంది .

అయితే అందులో నాలుగు ఫిలిం ఫెస్టివల్స్ కు నేను వెళ్ళలేకపోయాను .

కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ... ఆర్థిక సమస్యలే  .

మీరేం చదువుకున్నారు .

చెబితే నమ్మకపోవచ్చు . ఐదో తరగతి .


పంచతంత్రం గొప్పతనం ఏమిటి .

పంచతంత్రం క్రీ .శ. 300-500 సం. ల మధ్యలో రాయబడిందని పరిశోధకులు తేల్చారు . దీని రచయిత విష్ణుశర్మ. అన్నివిధాలుగా అప్రయోజకులని పేరుబడిన రాజకుమారులను కొన్ని నీతి కథల ద్వారా విష్ణుశర్మ ప్రయోజకులుగా మార్చుతాడు .ఇదే ఈ గ్రంథం లోని ప్రధానమైన కథ.

పంచతంత్రాన్ని తెలుగువారికి మొదటిసారిగా పరిచయం చేసింది నన్నయ్య.  పరవస్తు చిన్నయసూరి తెనిగించిన నీతిచంద్రిక పరమాద్భుతం . 

పంచతంత్రం లో మొత్తం 72 కథలున్నాయి .,

ఈ కథలన్నీ ఐదు విభాగాలుగా మలచబడ్దాయి .

మొదటిది మిత్రలాభం ...మంచి మిత్రుల వలన కలిగే లాభం వివరిస్తుంది . 

.రెండవది .. మిత్రబేధం . .. మిత్రులమధ్య ఏర్పడే శతృత్వం ఎంత నష్టదాయకమో వివరిస్తుంది .  మంచి మిత్రుల మధ్య శతృత్వం ఏర్పరిచేందుకు స్వార్థశక్తులు ఎప్పుడూ కాచుకునే ఉంటాయి కదా. 

మూడవది .. విగ్రహం . .. అంటే యుద్ధం . ఒక నెమళ్ళ గుంపు ,ఒక హంసల గుంపు మధ్య యుద్ధం జరుగుతుంది .యుద్దం ఎంత వినాశకరమో వివరిస్తుంది ఇది .

నాలుగవది .. సంధి .  ..ఇరుపక్షాల మధ్య కుదిరే సంధి ఎంత లాభదాయకమో వివరిస్తుంది .

చివరిది.. అపరీక్షితా కారకం.  ..Lack of indepth examination . Half knowledge is always dangerous.

తెలిసీ తెలియక తొందరపడి తీసుకునే నిర్ణయాల వలన కలిగే నష్టాలు ఏమిటి! అని తెలియజేస్తుంది .

ఒక కుటుంబం ఒక ముంగిసను పెంచేది . ఆ ఇల్లాలు బిడ్డను ప్రసవించింది.కొన్ని రోజుల తర్వాత బిడ్డను ఊయలలో వేసి నీళ్ళకు వెళ్ళింది ఇల్లాలు. నీరు నింపుకుని వస్తుండేసరికి వీధిలో ముంగిస ఎదురువచ్చింది.దాని నోరంతా నెత్తురే.

అయ్యో..తన బిడ్డను ముంగిస చంపేసిందనుకున్న ఇల్లాలు కోపంతో కుండను ముంగిస మీద విసిరింది.దెబ్బకు ముంగిస చనిపోయింది.


ఇల్లాలు ఇంటికెళ్ళి చూడగా .. జరిగింది విరుద్దంగా ఉంది. బిడ్డ నవ్వుతూ ఉన్నాడు. కింద చచ్చిన పాము మాంసఖండాలు పడి ఉన్నాయి.

అప్పటికి గాని అర్థం కాలేదా ఇల్లాలికి ... తన బిడ్డను పాము బారి నుంచి ముంగిసే రక్షించిందని.

ఆమె తీరిగ్గా బాధ పడితే మాత్రం ఎం లాభం ..చనిపోయిన ముంగిస తిరిగి వస్తుందా.

ఇలాంటి అనేక సంభ్రమశ్చర్యాలకు గురిచేసే , నీతిని భోధించే , మానవనైజాన్ని విశదపరచే గొప్ప కథలు కల సాహిత్యమే పంచతంత్రం.

మానవ జీవితాన్ని కాచి  వడబోసిన సారం ఉంటుందా కథలలో .

మానవ సహజ లక్షణాలను జంతు సహజ లక్షణాలతో కలిపి వినోదకరంగా నీతిని బోధించే మహా గొప్ప గ్రంధం పంచతంత్రం.

అలాంటి నీతి సాహిత్యం ప్రపంచంలో మరొకటి లేదు. ఇక రాబోదు.
పంచతంత్రం మన భారతసాహిత్యానికే మకుటాయమానం.

పంచతంత్రం ప్రపంచశాంతికి ఒక మార్గం. ఎలాగంటారా.. పిల్లలకు చిన్ననాడే  ఈ గ్రంథం లోని కథలు వివరిస్తే అవి వారికి మనసులో నాటుకుపోతాయి.  వారు పెరిగి పెద్ద అయితే భాద్యత కలిగిన పౌరులుగా మారుతారు . తద్వారా యుద్ధాలు తప్పుతాయి. వినాశనం ఉండదు .

అన్ని ప్రపంచభాషల్లోకి అనువాదం అయి , అందరి పిల్లలకు పాఠ్యపుస్తకాల్లో పరిచయం అయిన సాహితీ రాజం పంచతంత్రం .

కానీ పంచతంత్రానికి రావలసినంత గుర్తింపు రాలేదు.  కారణం ఏమిటంటే అది భారతీయ గ్రంథం కావడమే. దానితో పాటు పంచతంత్రంలో దేవుడు లేడు. భక్తీ లేదు. అవి ఉంటే తప్ప మన వాళ్ళకు అది గొప్ప గ్రంథం కాదు కదా! పంచతంత్రంలో కేవలం నగ్నమైన మానవ సహజ లక్షణాలు ఉన్నాయి . మానవుడు అరణ్యం లాంటి ఈ సమాజంలో ఎలా జీవించాలో తెలిపే మెళకువలున్నాయి.

ఏ మానవుడైనా గానీ పంచతంత్రాన్ని సమూలంగా చదివి , సంపూర్ణంగా ఆకళింపు చేసుకుంటే ఇక అతనికి వేరే విద్యతో పని లేదు.

పంచతంత్రం పిల్లలకు, పెద్దలకు , అందరికీ అవసరమైన మానవ సమాజ సజీవ చిత్రణ .

యానిమేషన్ రంగంలోకి ఎలా ప్రవేశించారు .

అప్పటికి నాకు ముప్పై అయిదేళ్ళు  . మా ఊరు పలాసలో అన్ని హంగులతో , అందరి ఆదరభిమానాలతో రాజాలా వెలిగిపోయే జీవితం నాది .ఒక రోజున అమెరికా నుంచి ఒక పాత మిత్రుడు వచ్చాడు, నన్ను కలవడానికి రెండుసార్లు తిరిగాడు. నేను లేను. వచ్చిన తర్వాత విషయం తెలుసుకుని అతన్ని కలవడానికి వెళ్ళాను.

అప్పుడతను పత్రికలవాళ్ళకు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు . నన్ను చూడగానే అతను ఆనందం తో లేచి వచ్చి కౌగలించుకున్నాడు .

అందరితో చెప్పాడు .. " నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఈయనే " అని. " నాలో ఉన్న ప్రతిభను గుర్తించి నాకు సరైన దారి చూపించిన వ్యక్తి ఈయన." అంటూ పరిచయం చేశాడు. 

అలా చెప్పిన ఆ వ్యక్తి సామాన్యుడు కాదు. అమెరికాలో ప్రసిద్ద చిత్ర నిర్మాణ స్టూడియో లో యనిమేటర్ గా పని చేసి ఇండియా వచ్చి ఒక ప్రసిద్ద నటుడితో కలసి ఒక గొప్ప యానిమేషన్ స్టూడియో పెట్టబోతున్నాడు .

తర్వాత  కొన్ని రోజులకు అతను హైదరాబాద్ వెళ్ళి స్టూడియో పనుల్లో నిమగ్నమయ్యాడు. 

కొంతకాలానికి నేను హైదరాబాద్ వెళ్ళాను.. వేరే పని మీద . 

పని పూర్తి చేసుకుని నా మిత్రుడ్ని కలిశాను.

అతను నన్ను ఒక ప్రాజెక్ట్ కమిటీలో మెంబర్ గా ఉండమన్నాడు.

అది పంచతంత్రం యానిమేషన్ ప్రాజెక్ట్ .

మేము రిపోర్ట్ తయారు చేయడం ప్రారంభించాం.

ఒక ఎపిసోడ్కు అయ్యే ఖర్చు 75 లక్షలు. ఎందుకంటే ఆనాడు ఈ టెక్నాలజీ లేదు . అప్పటి సెల్ యానిమేషన్ బాగా ఖరీదైనది. ఈ సెల్ యానిమేషన్ లోనే టాం అండ్  జెర్రీ చేయబడింది .

ఒక ఎపిసోడ్ కి వచ్చేది పాతిక లక్షలు .

ఖర్చు , రాబడి మధ్యన పొంతన లేకపోవడం వలన ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది .

నేను ట్రైన్ లో పలాస బయల్దేరాను . 
అప్పటికే యానిమేషన్ మీద నాకు అవగాహన పెరిగింది .ఆసక్తీ పెరిగింది .

చిన్నప్పటినుంచీ నాకు భారతీయ సంసృతీ సాహిత్యాలంటే గౌరవం. ఎందుకంటే వాటికి అంత గొప్పతనం ఉంది.
ట్రైన్లో పోతున్న సమయంలో  ఒక పుస్తకం చదివాను.
ఆ పుస్తకం దూబగుంట నారాయణ కవి రచించిన పంచతంత్రం . దానికి మాతృక విష్ణుశర్మ రచించిన సంస్కృత పంచతంత్రం.

అది నా పుస్తకాన్ని మార్చిన పుస్తకం.

అది చదివిన తర్వాత అంత గొప్ప నీతి సాహిత్యాన్ని దృశ్యరూపం లోకి మార్చాలనిపించింది . నిజానికి పంచతంత్రాన్ని తీయడానికి యానిమేషన్ ని మించిన మాధ్యమం లేదు .

మా ఊరెళ్ళిన తర్వాత దాని మీద పరిశోధన ప్రారంభించాను . స్వయంగా మిషనరీలు తయారుచేసుకున్నాను . ఎందుకంటే సంప్రదాయక యానిమేషన్ చాలా ఖరీదైనది . కాలం పట్టేది . 

నేను తయారు చేసిన పద్దతి.. అతి తక్కువ ఖర్చుతో తక్కువ కాలంలో పూర్తయ్యేది.  నా స్వయం సిద్దమైన టెక్నాలజీతో ఒక మామూలు కెమెరాతో " ఆవు - పులి " నీతి కథను తయారుచేశాను . ఈ కథకు మన సాహిత్యంలో ఎంతో గొప్ప స్థానం ఉంది.

ప్రాణం పోయినా  మాట తప్పకూడదు . సత్యానికి కట్టుబడి ఉండాలి అని  గోమాత చాటుతుంది . ఇది మన భారతీయ ఆత్మకు ప్రతిబింబం. 

22 నిమిషాల ఆ యానిమేషన్ ఫిలిం ను ఒక కాన్వెంట్ లో ప్రదర్శించాం  .

అది ఎంత పాపులర్ అయ్యిందంటే పిల్లలు అంత్యాక్షరి ఆడుకుంటుంటే సినిమా పాటలు బదులుగా " ఆవు - పులి "  లోని పద్యాలు పాడేవారు.

మీరు చేసిన ఇతర ప్రాజెక్టులు ఏవి.

వేమన సాహిత్యం పైన " విశ్వదాభిరామ వినురవేమ" అనే యానిమేటెడ్ వీడియో చేశాను .

వేమన ప్రపంచ కవుల్లోనే ఉన్నతమైన కవి.  ఎందరో కవులున్నారు . కానీ కవిత్వంతో సామాజిక విప్లవం తెచ్చిన, సంఘ సంస్కరణ చేసిన మహాకవి వేమన. అంతగొప్ప వేమన తెలుగువాడైనందుకు మనం గర్వపడాలి . వేమన బాధపడాలి ., ఎందుకంటే వేమన ఏ ఇంగ్లీషు కవిగానో పుట్టుంటే అందరూ నెత్తిన పెట్టుకునేవాళ్ళు .

తెలుగునుంచి ప్రపంచానికి అనువాదం  అయిన మొదటి తెలుగు సాహిత్యం .. అనే పేరుతో సి .పి. బ్రౌన్ చేత అనువదించబడిన వేమన పద్యాలు .

":విశ్వదాభిరామ వినురవేమ" 2006 లో పూర్తి చేసాను. 100  వేమన పద్యాలను తీసుకుని వాటిని ఎస్పీ బాలసుబ్రమణ్యం , నిత్యసంతోషిణి వంటి టాప్ సింగర్స్ చేత పాడించి , వాటికి అద్భుతమైన యానిమేషన్ చేసి 60 ని.ల నిడివి గల వీడియో గా మార్చాను .

దీనికి " The first prosody poetic animation in the world " గా గిన్నిస్ బుక్ రికార్డ్ కూడా ఇవ్వనున్నారు . కానీ ఏం లాభం.. నాకు ప్రోత్సాహం  లేదు .
ఇప్పుడు బెంగుళూరు కు చెందిన   నారాయణరెడ్డి స్వామీజీ ప్రోత్సాహం తోడయింది. దాంతో " విశ్వదాభిరామ వినురవేమ " ను డివిడి గా , బుక్ గా  రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాను .


మీ లక్ష్యం ఏమిటి .

భారతీయ సంసృతీ సాహిత్యాలంటే నాకు గౌరవం ,భక్తి .నిజంగా అవి చాలా గొప్పవి. ఆ గొప్పతనాన్ని నేడు చాలా మంది గుర్తించట్లేదు .మన సాంస్కృతిక  వారసత్వపు గొప్పతనాన్ని కనీసం పిల్లలకైనా అందించాలనేది నా తాపత్రయం .పిల్లలను ఆకట్టుకోవడానికి యానిమేషన్ ని మించిన మార్గం లేదు కదా .అందుకే యానిమేషన్ ద్వారా మన సంస్కృతి గొప్పతనాన్ని  చాటే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నంలో నాకు తోడయ్యే సహృదయుల కోసం ఎదురుచూస్తున్నాను .

ఈ ప్రయత్నంలో మీరు అందుకున్న సత్కారాల గురించి చెప్పండి .

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా " జ్ఞానీ ఫౌండేషన్ " వారు  ' కళా సామ్రాట్ "  బిరుదు  ప్రధానం చేశారు .

బెంగుళూరు కు చెందిన " ఇంటర్నేషనల్ ఇంటెగ్రిటీ పీస్ అండ్ ఫ్రెండ్ షిప్ సొసైటి " వారు డాక్టర్ సినారె గారి చేతుల మీదుగా " భారతజ్యోతి " అవార్డ్ బహూకరించారు .

వేమన గిన్నీస్ బుక్ లోకి ఎక్కబోతోంది .

ఈ టివి 2, సప్తగిరి , టివి 9 , హెచ్ ఎం టివి , విస్సా టివి తదితర టీవీ చానెల్స్ లో నా యానిమేషన్ ప్రాజెక్టుల గురించి  , నా నూతన టెక్నిక్  గురించి కార్యక్రమాలు ప్రసారం చేశారు .

ఇండియా టుడే , టైంస్ ఆఫ్ ఇండియా , ఇండియన్ ఎక్స్ ప్రెస్, డెక్కన్ క్రానికల్ ,ఈనాడు , సితార, ఆంద్రజ్యోతి , వార్త , సుప్రభాతం  తదితర ప్రముఖ పత్రికలలో నా గురించి ప్రత్యేకం గా రాశారు .
 
ధన్యవాదాలు .

  S.R.Gold smith .
  Yousuf Guda '
   Hyderabad .

Cell : 98499 32519 .
Website : teluguanimation.com

1 comment: