అదొక కీకారణ్యం. మానవ సంచారం లేని ఆ అరణ్యం సహజ ప్రకృతితో ఎంతో అందంగా అలరారుతోంది. ఆ అరణ్యంలో ఎంతో పెద్దదైన ఓ రావిచెట్టు మీద అనేక కాకులు నివసిస్తున్నాయి. వాటిలో మందవేగుడు అనే కాకి కూడా ఉంది .
మందవేగుడికి చాలాకాలంగా నయం కాని ఓ జబ్బు పట్టి పీడిస్తొంది , వైద్యం చేయడంలో అనుభవం ఉన్న ఓ వృద్దుడైన కాకిని కలసి మందవేగుడు తన బాధ అంతా చెప్పుకున్నాడు . ఆ కాకి వైద్యుడు ఎంతో దూరంలో ఉన్న రత్నగిరి కొండల గురించి చెప్పి ఆ కొండల్లో ఉన్న ఓ మూలిక గురించి చెప్పాడు . దాన్ని నమిలి రసం మింగితే నీ జబ్బు నయమవుతుందని చెప్పాడు .
మందవేగుడు తన మిత్రుడైన శీఘ్రవేగుడ్ని తోడుగా రమ్మన్నాడు, తన భార్యా పిల్లలతో మాట్లాడి ఇప్పుడే వస్తానని శీఘ్రవేగుడు వెళ్ళాడు, మరి రాలేదు , ఆ రోజు గడచి పోయింది . మందవేగుడు మరో మిత్రుడ్ని పిలిచాడు , ఆ మిత్రుడు కూడా ఇదిగో వస్తానంటూ కాలం గడిపేశాడు .
ఓ రోజు మందవేగుడు ఆహారాన్వేషణలో ఉండగా వైద్యుడు యధాలాపంగా కలిశాడు, " ఏమోయి ...మందవేగా ..నీ జబ్బు నయమైందా ! " అని కుశల ప్రశ్నలు వేశాడు వైద్యుడు . మందవేగుడు తన మిత్రులెవరూ తోడు రావడం లేదని చింతిస్తూ చెప్పాడు .
" ఓయీ ! మందవేగుడా ! నీది బుద్ది హీనత తప్ప మరొకటి కాదు ; ఇతరుల మీద ఆధారపడితే పనులు జరగవని మీ పెద్దలు నీకు చెప్పలేదా! కార్య సాధకుడు ఎవరి మీదా ఆధారపడడు ,తనను తాను నమ్ముకుని ముందుకు పోతాడు , కార్యం సాధిస్తాడు , ఇకనైనా పరాయివారి మీద ఆధారపడడం మాని నిన్ను నువ్వు నమ్ముకుని కార్యరంగం లోకి దూకు . విజయం సాధిస్తావు , జీవితంలో చిన్న పనికైనా , పెద్దపనికైనా ఇదే విజయసూత్రం , " అని మందలించిన కాకి వైద్యుడు వెళ్ళిపోయాడు .
మందవేగుడు ఇంతకాలం ఇతరుల మీద ఆధారపడినందుకు చింతిస్తూ రత్నగిరి కొండల వేపు పయనమయ్యాడు
.
No comments:
Post a Comment