శ్రీ శివపురాణము - 1

ఒకానొక సమయములో ఋషులందరూ బ్రహ్మను కలసి తమకు అన్నివిధాల అనుకూలమైన ఒక తపో స్థలాన్ని ప్రసాదించమని వేడుకున్నారు. బ్రహ్మ విష్ణువును స్మరించి ఒక చక్రాన్ని సృష్టించి విడిచాడు. ఋషులు దాన్ని  అనుసరించసాగారు. ఆ చక్రం ఒక ప్రదేశంలో ఒక రాక్షసుని సం హరించి  అక్కడనే నిలిచిపోయింది.
అదే నైమిశారణ్యం. పార్వతీదేవి ఒకానొక సమయంలో తపస్సు చేసిన ప్రదేశం అదే అని తెలుసుకున్న ఋషులు ఎంతో అనందించారు.
మొత్తం ఎనభై ఎనిమిదివేల  మంది  ఋషులు నైమిశారణ్యంలో తపోవాటికలు నిర్మించుకున్నారు. లోకం శ్రేయస్సు కోరి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడం ప్రారంభించారు.
ఆ సమయంలో సూతమహర్షి అక్కడకు వచ్చాడు. ఆయన వేదవ్యాసుడి ప్రియశిష్యుడు.మహా పౌరాణికుడు.
ఆ మహానుభావుడి రాకకు మునిగణమంతా ఎంతో సంతోషించింది.అందరూ ఘనంగా స్వాగతం పలికారు. ఆర్ఘ్యపాద్యాదులిచ్చి సత్కరించారు.
ఋషులు సూతమహర్షిని ఒక కోరిక కోరారు. ' మహాత్మా! ఒక మహా దివ్యమైన పురాణాన్ని వినిపించి మమ్మల్ని తరింపజేయండి '. అని.'
" సర్వులనూ ఉద్దరింపగల ఏకైక పురాణం ఏది " అని ఆలోచించాడు సూతుడు.
ఆయనకు ఆ సమయాన శ్రీ మహాశివుని పురాణం మదిలో గోచరించింది.
' అన్ని పురాణాలలోనూ సర్వ శ్రేష్టమైనదీ ,మోక్ష ప్రదాయినీ   ' పుణ్యాత్ములైన వారికి మాత్రమే వినే అవకాశం దక్కేదీ  అయిన శ్రీ శివపురాణమును మీకు చెబుతాను.' అంటూ ఉత్సాహంగా  ప్రారంభించాడు సూతుడు.
ఋషులందరూ మహా అసక్తితో , ఎంతో భక్తితో వినడం ప్రారంభించారు.

1 comment: